నన్ను ఉద్యోగం నుంచి తొలగించడం తప్పని ప్రతి ఐఏఎస్‌ అధికారికీ తెలుసు.. వెంకట్రామిరెడ్డి ఫైర్

  • ఏపీ ఉద్యోగులతో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయించారన్న వెంకట్రామిరెడ్డి
  • ప్రధాని మోదీని తిట్టించారని ఆరోపణ
  • ఉద్యోగుల పట్ల జగన్ చాలా హుందాగా వ్యవహరించారని వ్యాఖ్య

ప్రభుత్వం తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తప్పుబట్టారు. ఇది కేవలం ఉద్యోగులను భయపెట్టడానికి చేస్తున్న చర్య అని మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వంపై, గతంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై సంచలన ఆరోపణలు చేశారు.


గతంలో చంద్రబాబు ఏపీ ఉద్యోగులను కర్ణాటకకు తీసుకెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించారని, ప్రధాని మోదీని తిట్టించారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులను రాజకీయంగా వాడుకున్న చరిత్ర చంద్రబాబుదేనని అన్నారు. తాను ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదని గతంలో అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తనను తొలగించడం తప్పని ప్రతి ఐఏఎస్‌ అధికారికి తెలుసని ఆయన పేర్కొన్నారు.


ఉద్యోగుల పట్ల జగన్ చాలా హుందాగా వ్యవహరించారని, కూటమి ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వం 100 రెట్లు మేలు చేసిందని కొనియాడారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల కోసం కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఆయన నిలదీశారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 15వ తేదీ దాటినా జీతాలు రావడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. 


కాగా, ఏపీ పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామి రెడ్డి గత వైసీపీ పార్టీకి ప్రచారం చేశారన్న ఆరోపణతో నిన్న ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  


Venkatrami Reddy
jagan
ysrcp
chandrababu
tdp

More Telugu News